: సల్మాన్ కు సపోర్ట్ ఇస్తున్న వారి సినిమాలను నిషేధించాలి... ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయమన్న సామాజికవేత్త
ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడటంతో బాలీవుడ్ షాక్ కు గురైంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సల్లూభాయ్ కి శిక్ష పడటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, రకరకాల కామెంట్లు చేశారు. అయితే, సల్మాన్ కు శిక్ష విధించడాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని 'నేషనల్ ఫోరమ్ ఫర్ హౌసింగ్ రైట్స్' అనే సంస్థ కన్వీనర్ ఇందు ప్రకాష్ సింగ్ పిలుపునిచ్చారు. శిక్షను ఖండిస్తూ బాలీవుడ్ ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కూడా అన్నారు. "బాలీవుడ్ ఇండియాలో ఉన్నట్టు అనిపించడం లేదు. అంతేకాదు, రాజ్యాంగం కన్నా పైస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. అదే నిజమైతే, బాలీవుడ్ సినిమాలను నిషేధించాలి. ముఖ్యంగా సల్మాన్ శిక్షను ఖండిస్తున్న వారి సినిమాలను" అంటూ ఇందు ప్రకాష్ వ్యాఖ్యానించారు. సల్మాన్ తప్పు చేశాడని... చట్టం ఎవరినీ ఉపేక్షించదని అన్నారు. మన న్యాయవ్యవస్థ సరైన రీతిలో, భయం లేకుండా ముందుకు సాగుతుండటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.