: ఫుక్తల్ నదిపై తెగిన ఆనకట్ట... కార్గిల్ లోతట్టు ప్రాంతాలకు ముప్పు
జమ్ము కాశ్మీర్ పరిధిలోని కార్గిల్ సమీపంలో ఫుక్తల్ నదిలో కొండచరియలు విరిగిపడ్డ కారణంగా ఏర్పడిన కృత్రిమ సరస్సు ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో నదిలో నిల్వ ఉన్న నీరంతా ఒక్కసారిగా బయటకు ఉరికింది. ఉదయం 8 గంటలప్పుడు ఈ ఘటన జరుగగా, 10:15 గంటల సమయానికి నీరు పడుమ్ ప్రాంతానికి చేరుకుని, ఆపై లుంగ్ నాగ్ నదిలోకి దూకింది. నీటి ఉద్ధృతికి నదిపై నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జిలు కొట్టుకుపోయాయని సైన్యాధికారి ఒకరు తెలిపారు. లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఉన్నందున ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ ప్రాణనష్టం జరగలేదని వివరించారు. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు గడ్డకట్టే ఈ నదిపై ఎప్పుడైనా ఆనకట్టలు తెగిపోయే ప్రమాదముందని అధికారులు గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు.