: కేంద్ర రక్షణ మంత్రితో ముగిసిన కేసీఆర్ భేటీ... సానుకూలంగా స్పందించిన పారికర్
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రక్షణ మంత్రితో భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే వీరి భేటీ ముగిసింది. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ లు మీడియాతో మాట్లాడుతూ, భేటీ వివరాలను వివరించారు. 40 నిమిషాలపాటు కొనసాగిన ఈ సమావేశంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం జింఖానా, బైసన్ పోలో స్థలాలను ఇవ్వాలని కేసీఆర్ కోరారని... దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే రాష్ట్రంలో రెండు సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. మెదక్, కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారుల వెడల్పు కోసం డిఫెన్స్ భూములను ఇవ్వాలని కోరారని వెల్లడించారు. దీనికి తోడు, ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని తరలించేందుకు కంటోన్మెంట్ మీదుగా పైప్ లైన్లు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరినట్టు ఎంపీలు తెలిపారు.