: రూ. 2.24 లక్షల కోట్ల పెట్టుబడి తెస్తూ, తెలుగు రాష్ట్రాలవైపు కన్నెత్తి చూడని జపాన్


వచ్చే ఐదేళ్లలో భారత పెట్టుబడులను సుమారు 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2.24 లక్షల కోట్లు)కు పెంచాలని భావిస్తున్న జపాన్, తెలుగు రాష్ట్రాలపై శీతకన్నేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ లను ఏర్పాటు చేయనున్న జపాన్ ప్రభుత్వం, అందుకు స్థలాలను ఎంపిక చేసుకోగా, వాటిల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు లేవని తెలుస్తోంది. భారీ పెట్టుబడులు, లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ టౌన్ షిప్ లను తెలంగాణకు తేవాలని కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ కు రప్పించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, జపాన్ మాత్రం కర్ణాటకలోని తుమ్కూరు, రాజస్థాన్ లోని గిలాట్, నీమ్ రానా, గుజరాత్ లోని మండల్, మహారాష్ట్రలోని సుపా ప్రాంతాలను ఎంచుకుంది. వీటితో పాటు తమిళనాడులోని పొన్నేరి, హర్యానాలోని జజ్జర్, గ్రేటర్ నోయిడాల్లోనూ టౌన్ షిప్ లను నిర్మించనుంది. వీటిని జపాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఉత్పత్తి రంగంలో నైపుణ్యంగల యువతను తయారు చేసే దిశగా ఈ టౌన్ షిప్ లలో జపాన్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనుంది. సెజ్ చట్టం కింద నిర్మితం కానున్న ఈ టౌన్ షిప్ లకు తొలి ఐదేళ్లూ పలు రాయితీలు ఉంటాయి. 100 శాతం ఎగుమతి పన్ను రద్దు వీటిలో కీలకమైనది. తదుపరి ఐదేళ్లూ 50 శాతం పన్నుతో ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News