: దావూద్ ను అప్పగించమని భారత్ ఎప్పుడూ కోరలేదు: ఢిల్లీలో పాక్ రాయబారి బాసిత్
చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీంను అప్పగించమని తమను భారత్ ఎప్పుడూ కోరలేదని పాకిస్థాన్ చెబుతోంది. ఈ మేరకు నిన్న రాత్రి ఓ ఆంగ్ల టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢిల్లీలో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. నిన్న పార్లమెంట్ లో కేంద్ర విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖల సహాయ మంత్రులు హరిభావ్ చౌదరి, కిరణ్ రిజిజూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని కూడా ఆయన చెప్పారు. దావూద్ ఎక్కడున్నాడన్న విషయంలో తమ వద్ద సమాచారం లేదని నిన్న కేంద్రం పార్లమెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రుల ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దీంతో వెనువెంటనే దావూద్ పాక్ లోనే తలదాచుకున్నాడని రిజిజూ మాట మార్చారు. ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని అబ్దుల్ బాసిత్ పాక్ వాదనను మరోమారు వినిపించారు. అసలు దావూద్ తమ భూభాగంలోనే లేడని కూడా ఆయన పేర్కొన్నారు.