: స్మార్ట్ సిటీ కాబోతున్న రాహుల్ నియోజకవర్గం
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజకవర్గానికి మహర్దశ పట్టబోతోంది. ఈ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు ఈ విషయాన్ని తెలియజేసినట్టు అధికారులు తెలిపారు. అమేథీ అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఈ మేరకు లేఖ రాశామని ఆ నియోజకవర్గ ఏడీఎం ఎంపీ.సరోజ్ చెప్పారు. ఈ నేపథ్యంలో అమేథీ ప్రజలకు వైఫై సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారులు, ఈ-గవర్నెన్స్, ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ వంటి తదితర సౌకర్యాలను అందించి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్టు అధికారులు వివరించారు.