: ఐరాసకు మహిళా బాస్... ఇదే మంచి తరుణమంటున్న బాన్ కీ మూన్
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ తరహా దుష్పరిణామాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అన్ని దేశాల మద్దతులో ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితికి ఇప్పటిదాకా పురుష పుంగవులే నేతృత్వం వహించారు. ప్రస్తుతం ఆ సంస్థ సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్న బాన్ కీ మూన్ వచ్చే ఏడాది డిసెంబర్ లో పదవీ విరమణ చేయనున్నారు. 2007 నుంచి ఐరాస సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్న బాన్ కీ మూన్, సంస్థ బాధ్యతలు మహిళా నేతలకు అప్పగించేందుకు ఇదే సరైన తరుణమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఆయన పలువురు మహిళా నేతలతో వరుస సమావేశాలు కూడా నిర్వహించారు. మరి ఐరాస సెక్రటరీ జనరల్ పదవి చేపట్టే సామర్థ్యమున్న మహిళా నేత ఎవరైనా తారసపడ్డారా? అన్న ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం రావట్లేదు. తన తర్వాత ఈ పదవి చేపట్టే వ్యక్తి ఎంపిక విషయంలో తనకేమాత్రం కూడా సంబంధం లేదని ఆయన ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. అయితే మూన్ తర్వాత ఐరాస సెక్రటరీ జనరల్ గా మహిళా నేత పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని హక్ కూడా పేర్కొనడం గమనార్హం.