: సమ్మె జరుగుతున్నా బస్సులు తిరుగుతున్నాయ్!
తమకు 42 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందేనంటూ, ఆర్టీసీ కార్మికులు ప్రారంభించిన సమ్మె గంటల వ్యవధిలోనే తేలిపోయింది. గత అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కాగా, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు జోరుగా సాగుతుండడంతో పలు ప్రాంతాల్లో బస్సులు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. పలు డిపోల నుంచి సుమారు 2 వేలకు పైగా బస్సులు రోడ్లపైకి వచ్చాయి. గుంటూరు, విజయవాడల మధ్య 62 బస్సులు తిరుగుతూ ప్రయాణికుల అవసరాలు తీరుస్తున్నాయి. గుంటూరు నుంచి రాజమండ్రి, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు తదితర ప్రాంతాలకు బస్సులు బయలుదేరి వెళ్లాయి. నెల్లూరు జిల్లా నుంచి 50కి పైగా బస్సులు బయటకొచ్చి సమీప ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. కొన్ని బస్సుల్లో పోలీసులను సెక్యూరిటీగా పెట్టారని తెలుస్తోంది. ఒంగోలు జిల్లాలో సైతం 100కి పైగా బస్సులు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. రాత్రికి సూపర్ లగ్జరీ బస్సులను దూరప్రాంతాలకు తిప్పుతామని అధికారులు తెలిపారు. తిరుమల వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా చాలినన్ని బస్సులను తిప్పుతున్నట్టు వివరించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని డిపోల వ్యాప్తంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పోస్టుల కోసం నిరుద్యోగులు, హెవీ లైసెన్స్ కలిగిన డ్రైవర్లూ క్యూ కట్టారు.