: అనాల్సిన మాటలన్నీ అనేసి, 'సారీ'తో సరి పెట్టిన హౌసింగ్ డాట్ కాం సీఈఓ


బోర్డు డైరెక్టర్లను ఎందుకూ పనికిరానివారని అన్నాడు. మీ వల్లే సంస్థ అధోగతి పాలవుతోందని ఆరోపించాడు. ఈ సంస్థలో ఉండేది లేదంటూ రాజీనామా చేశాడు. అతడే స్టార్టప్ సంస్థగా ప్రారంభమై అనతికాలంలో పేరు తెచ్చుకున్న హౌసింగ్ డాట్ కాం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ యాదవ్. వారం రోజుల క్రితం రాహుల్ చేసిన రాజీనామా, డైరెక్టర్లపై చేసిన వ్యాఖ్యలు వ్యాపార వర్గాల్లో సంచలనం కలిగించాయి. కానీ, ఈలోగా ఏం జరిగిందో ఏమో! తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్టు రాహుల్ తెలిపారు. "బోర్డు డైరెక్టర్లతో జరిపిన ఆశావాహ చర్చల అనంతరం నా రాజీనామాను ఉపసంహరించుకుంటున్నాను. నేను చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలపట్ల బోర్డు సభ్యులకు క్షమాపణ చెబుతున్నా. సంస్థలో సీఈఓగా కొనసాగి మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తా. ఈ మేరకు బోర్డు సహకారం తీసుకుంటా" అని రాహుల్ కంపెనీ ద్వారా వెలువడిన ప్రకటనలో వివరించారు. మూడేళ్ల క్రితం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యను వదిలేసి వచ్చి బాంబే ఐఐటీ మిత్రులతో కలసి హౌసింగ్ డాట్ కాంను రాహుల్ యాదవ్ ప్రారంభించారు. గత సంవత్సరం ఈ కంపెనీలో జపాన్ సాఫ్ట్ బ్యాంక్ రూ. 550 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ఇప్పుడా సంస్థ విలువ రూ. 1,500 కోట్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News