: ఆంధ్రా, తెలంగాణల్లో నిలిచిపోతున్న ఆర్టీసీ...ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వాలు
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43శాతం ఫిట్ మెంట్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల రవాణా శాఖ మంత్రులు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపాయి. 27 శాతం ఫిట్ మెంట్ చెల్లిస్తామని కార్మిక సంఘాల ముందు ప్రతిపాదించాయి. దీనిపై మండిపడ్డ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో నేటి అర్ధ రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. మరోవైపు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హెవీ వెహికల్ లైసెన్సు ఉన్న వారు ఆర్టీసీ డిపోల్లో సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే 10వ తరగతి పాస్ అయినవారు కండక్టర్లుగా పనిచేసేందుకు సంప్రదించాలని సూచిస్తున్నారు. డ్రైవర్లకు 1000 రూపాయలు, కండక్టర్లకు 800రూపాయలు వేతనంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.