: "నేను వేడుకుంటున్నా... దయచేసి సహకరించండి": ప్రతి పక్షాలకు జైట్లీ వేడుకోలు


"నేను వేడుకుంటున్నా... దయచేసి సహకరించండి" అంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు లోక్ సభలో ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. గత కొంత కాలంగా పెండింగు లో వున్న కీలకమైన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్ టీ) బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈ రోజు మాట్లాడారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, దీనిని మళ్లీ పార్లమెంటరీ కమిటీల సమీక్షకు పంపకుండా, బిల్లును ఆమోదించాలని ఆయన కోరారు. మన ముఖ్యమంత్రులందరూ దీనికి మద్దతు తెలుపుతుండగా, మనమెందుకు ఆలస్యం చేస్తున్నామని ఆయన ప్రశ్నించారు. రెండున్నరేళ్లు బిల్లుపై పలు దఫాలుగా చర్చలు జరిగాయని, డజన్ల కొద్దీ సాధికార కమిటీలు చర్చించాయని అన్నారు. కొన్ని పార్టీల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటే ఈ బిల్లు మరింత ఆలస్యం అవుతుందని, దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ, తాము ఈ బిల్లుకు మద్దతిస్తున్నామని చెబుతూ, ఇది తమ ప్రభుత్వ ఆలోచనే అని గుర్తు చేశారు. అయితే, బీజేపీ ప్రతిపాదించే మార్పులకు మాత్రం అంగీకరించబోమని అన్నారు. కాగా, గతంలో కీలకాంశాల విషయంలో బీజేపీకి దన్నుగా నిలిచిన ఏఐఏడీఎంకే కూడా ఈ జీఎస్టీ బిల్లును ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్నందున దీని ఆమోదానికి పార్లమెంటులో మూడింట రెండింతల మెజారిటీ అవసరం. రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి ఆ మెజారిటీ లేదు. నేడు లోక్ సభలో ప్రారంభమైన చర్చ రేపు కూడా కొనసాగి చివరలో వోటింగుకి వెళుతుంది

  • Loading...

More Telugu News