: ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ ఇవ్వాలంటే... బస్సు ఛార్జీలు పెంచక తప్పదు: ఆర్టీసీ ఎండీ
కార్మికులకు వేతన సవరణ చేయాలంటే బస్సు ఛార్జీలు పెంచక తప్పదని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు. రెండేళ్లుగా బస్సు ఛార్జీలు పెంచలేదని, ఇప్పుడు 15 శాతం పెంచాలని భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే ఛార్జీలు పెంచుతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు 27 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు తాము సిద్ధమేనని అన్నారు. దాంతో ఆర్టీసీపై రూ.800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. సంస్థ పరిస్థితి బాగోలేకున్నా వేతనాలు పెంచేందుకు ఒప్పుకున్నామన్నారు. అయితే 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేశారు. కార్మికుల డిమాండులు తీర్చాలంటే నిధులు సమీకరించుకోవాలని, సంస్థ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం వేశారని ఆర్టీసీ ఎండీ చెప్పుకొచ్చారు. కమిటీ నివేదిక రాగానే డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. కానీ చర్చలు పూర్తికాకముందే సమ్మెకు వెళ్లటం సమంజసం కాదని, సమ్మె విరమించాలని కార్మికులను కోరారు. ప్రస్తుతం సమ్మెకు వెళ్తే సంస్థ మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. సమ్మె ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నామన్న సాంబశివరావు, సమ్మెకు వెళ్లవద్దని చర్చల సమయంలో చాలాసేపు కోరామన్నారు.