: ఒబామాతో లోకేష్ మీటింగ్ పై సోషల్ మీడియాలో దుమారం
టీడీపీ కార్యకర్తల నిధి సమన్వయకర్త నారా లోకేష్ ఆమెరికా పర్యటనపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. లోకేష్ అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమవనున్నారని, ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులపై చర్చించనున్నారని ఏపీలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. పర్యటన కోసం ఆయన అమెరికా బయల్దేరి వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒబామాతో లోకేష్ భేటీపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి హోదా ఉన్న చంద్రబాబునాయుడుకి దొరకని ఒబమా అపాయింట్ మెంట్ లోకేష్ కు ఎలా దొరికిందా? అని సోషల్ మీడియాలో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, డెమోక్రాటిక్ పార్టీకి నిధుల సేకరణ కోసం మన కేజ్రీవాల్ లా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అందులో పాల్గొనేందుకు 500 డాలర్ల ఎంట్రీ ఫీజు చెల్లించాలని, ఆయనతో డిన్నర్ చేయాలనుకుంటే 5000 డాలర్లు ఫీజు చెల్లించాలని, అలా కాకుండా, ఆయనతో ఫోటో దిగి, ఓ రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటే 10,000 డాలర్లు వెచ్చించాలని ఓ పోస్టు పెట్టారు. అందులో భాగంగా లోకేష్ ఆయనను కలవనున్నాడని, ఆ తరువాత ఆయనతో దిగిన ఫోటో అడ్డం పెట్టుకుని ఏపీలో ప్రచారం చేసుకుంటాడని ప్రణాళిక వేసినట్టు విమర్శలు కురుస్తున్నాయి. దీనిపై లోకేష్ స్పందిస్తే కానీ నిజానిజాలు వెల్లడికావు.