: వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుంది...: కేసీఆర్ పై రేవంత్ ఫైర్
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ విలువల గురించి బోధించడాన్ని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. శాసనసభలో విలువలకు తిలోదకాలిచ్చిన కేసీఆర్, ఇప్పుడు సభలో పాటించాల్సిన పద్ధతులపై క్లాసులు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ శిక్షణా తరగతులు కేసీఆర్ ను స్తుతించడం కోసమేనని, వాటిలో ప్రజా సమస్యలపై చర్చలు జరగడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమానికి అసెంబ్లీ కార్యదర్శి, హైదరాబాద్ సీపీ వెళ్లడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.