: అభివృద్ధిలోనూ సచిన్ దూకుడు... ఆదివాసీల కాలనీలో ఎంపీ ల్యాడ్ నిధులతో కనీస సౌకర్యాలు
భారతరత్న అవార్డు గ్రహీత, మాస్టర్ బ్లాస్టర్ గా క్రికెట్ ప్రపంచం పిలుచుకునే రాజ్యసభ సభ్యుడు, విశ్వవిఖ్యాతి గాంచిన మాజీ క్రికెటర్ సచిన్ రమేశ్ టెండూల్కర్... క్రికెట్ మైదానంలోనే కాదండోయ్, అభివృద్ధి మంత్రంలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. రాజకీయాల్లో తలలు పండిన నేతల కంటే అతడే మెరుగంటూ అతడు చేస్తున్న పనులే చెబుతున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలోని ఆదివాసీల కాలనీలో సచిన్ వెలుగులు నింపుతున్నాడు. స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి కూడా అదే స్థలంలో ఆ కాలనీ ఉన్నా, నేటికీ ఆ కాలనీలో కనీస సౌకర్యాలు కూడా లేవు. ఏ ఒక్క రాజకీయ నేత కూడా ఆ కాలనీ దిశగా కన్నెత్తి చూడలేదు. దేశ వాణిజ్య రాజధానిగా ఎదిగిన ముంబై అత్యంత ఆధునిక సౌకర్యాలకు నిలయమైతే, దానికి సమీపంలోని ఆదివాసీల కాలనీ మాత్రం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదు. ఇప్పటికీ మల విసర్జన కోసం ఆ కాలనీ వాసులు అడవిలోకి పరుగెత్తాల్సిందేనట. ఈ క్రమంలో అడవి మృగాల దాడులు ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ కాలనీపై సచిన్ దృష్టి సారించారు. కాలనీలో మరుగుదొడ్ల ఏర్పాటుకు తన ఎంపీల్యాడ్స్ నిధులను వెచ్చిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాగా, మరికొన్నింటి నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. ఇక రాత్రి వేళల్లో చిమ్మచీకటి అలముకునే కాలనీలో సచిన్ విద్యుద్దీపాలను కూడా ఏర్పాటు చేయించాడట. నిర్మాణం పూర్తి చేసుకున్న మరుగుదొడ్లను చూసిన ఆదివాసీలు, సచిన్ క్రికెట్ కే కాదు తమకూ దేవుడేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు.