: టీఆర్ఎస్ నేతలంటే వాటికి ఎంతిష్టమో!
టీఆర్ఎస్ నేతలంటే తేనెటీగలకు చచ్చేంత ఇష్టంలా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ నేతలపై తమ ప్రేమాభిమానాలు కురిపిస్తున్నాయి. మొన్నామధ్య జగిత్యాలలో కేటీఆర్, ఈటెలను పరుగులు పెట్టించిన తేనెటీగలు, నిన్నటికి నిన్న కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ ను పరుగులు పెట్టించాయి. తాజాగా ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై తమ ప్రతాపం చూపే ప్రయత్నం చేశాయి. కార్లు ఉండి బతికిపోతున్నారు కానీ, లేకపోతే టీఆర్ఎస్ నేతలను తేనెటీగలు ముద్దాడి ఉండేవే. ఇక్కడ ఇంకో విశేషం కూడా దాగి వుంది. వందిమాగధులతో ఊరేగే అమాత్యుల చుట్టూ అంత మంది కూలీ జనం ఉన్నప్పటికీ వారిని ఏమీ చేయకుండా, కేవలం అమాత్యులు, వారి అనుంగు కార్యకర్తల వెంటపడి తరమడమే ఇక్కడ తేనెటీగల ప్రత్యేకత. ఇలా ఇవి చూపించే ప్రేమాభిమానాలకు తట్టుకోలేకపోతున్న టీఆర్ఎస్ నేతలు గ్రామీణ ప్రాంతాలకు 'మిషన్ కాకతీయ' పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నట్టు సమాచారం.