: ఇక ఎవరైనా గన్ పట్టుకోవచ్చు!... ఆయుధాల చట్ట సవరణకు కేంద్రం ప్రతిపాదన
ఇండియాలో ఆయుధాల జారీ విధానాన్ని మరింత సరళతరం చేస్తూ, ఆయుధాల చట్ట సవరణకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే మరింత సులువుగా తుపాకీ లైసెన్స్ లభించనుంది. ప్రస్తుతం ఓ ఆయుధాన్ని వెంట ఉంచుకోవాలంటే, పోలీసులడిగే మొత్తం రెండు డజన్లకు పైగా డాక్యుమెంట్లు సమర్పించాల్సి వుంది. ఈ డాక్యుమెంట్ల సంఖ్యను 10 నుంచి 12 వరకూ కుదించాలని, పోలీసు వెరిఫికేషన్ వ్యవధిని మూడు నెలలకు పరిమితం చేయాలని కేంద్రం ముసాయిదా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇకపై ప్రతి ఆయుధానికి ఒక నెంబరును (యూఐఎన్ - యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్) కేటాయిస్తామని, ఇప్పటికే ఆయుధాల లైసెన్స్ లను పొందిన వారు కూడా ఈ నెంబరును తీసుకోవాలని సూచిస్తూ, అక్టోబర్ 1 నుంచి ఈ సంఖ్యలేని ఆయుధాల లైసెన్స్ రద్దయినట్టేనని ప్రతిపాదించింది. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆ ఆయుధాన్ని ఉపయోగించడంలో శిక్షణ తీసుకున్నట్టుగా రిజిస్టర్డ్ షూటింగ్ క్లబ్ నుంచి సర్టిఫికెట్ పొందాల్సి ఉండేలా నిబంధనలు మార్చాలని నిర్ణయించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, దాడులు, హింసాకాండ పెరిగిపోవడం, ఉగ్రవాదుల, దొంగల చర్యలు మితిమీరుతున్న నేపథ్యంలో ఆయుధాల లైసెన్స్ లు సులభతరం చేయాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వివరించారు.