: పేలడానికి సిద్ధంగా ఉన్న చైనా స్టాక్ మార్కెట్ 'బుడగ'!
ఓ కెచప్ తయారు చేసే సంస్థ, మరో విలువైన లోహాలను డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీ, ఇంకో వైద్య రంగంలో ప్రొడక్టులు తయారు చేస్తున్న సంస్థ... ఇలా ఓ పరిధి దాటని కంపెనీలు స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరిస్తే... ఇండియాలో అయితే, ఇది చాలా కష్టం. ఈ తరహా కంపెనీలు కూడా మన మార్కెట్లో దాదాపు లేవు. కానీ, చైనాలో మాత్రం కాదు. చైనా ఈక్విటీ మార్కెట్లో కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చిన ఈ తరహా కంపెనీలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. వ్యాపార సూత్రాలకు వ్యతిరేకంగా వెళుతూ మార్కెట్ ను శాసిస్తున్న ఇటువంటి సంస్థలు ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. సులభంగా రుణాలు లభించడం, బ్యాంకింగ్ వ్యవస్థపై నిఘా కొరవడడం కారణాలతో పాటు, ఇన్ సైడర్ ట్రేడింగ్ అధికంగా జరగడంతో చైనా బెంచ్ మార్క్ షాంగై ఇండెక్స్ ఆరు నెలల వ్యవధిలో రెట్టింపయింది. ఇదే సమయంలో మన మార్కెట్లలో లాభం కేవలం 4 శాతమే. చైనా ఆర్థిక వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠస్థాయిలో 7 శాతానికి దిగజారిన సమయంలో, ఇలా స్టాక్ మార్కెట్ అనారోగ్యకరంగా పెరగడం వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి 'బబుల్' మార్కెట్ పేలి మరింత ఇబ్బందులు తీసుకురాకముందే స్పందించాలని సూచిస్తున్నారు. అసంతృప్తికరంగా ఆర్థిక వ్యవస్థ పనితీరు కొనసాగుతున్న వేళ, స్టాక్ మార్కెట్ల పెరుగుదల 'పెరుగుతున్న బుడగ'కు సంకేతమని జేపీ మోర్గాన్ వ్యాఖ్యానించింది. ఉదాహరణకు, అప్పుల్లో కూరుకుపోయి, నిర్వహణా లాభాలు 2 శాతంగా ఉండి, విలువైన లోహాల డిస్ట్రిబ్యూషన్ రంగంలో సేవలందిస్తున్న బీజింగ్ కింగీ ఈక్విటీ, ఆఫర్ ప్రైస్ తో పోలిస్తే ఇప్పుడు 138 రెట్లు అధిక ధరలో ట్రేడింగ్ అవుతోంది. గడచిన నెల రోజుల వ్యవధిలో షేరు విలువ రెట్టింపైంది. మరో రసాయనాల సంస్థ తకే కాఫ్కో తున్హీ ఈక్విటీ విలువ సంవత్సరం వ్యవధిలో మూడు రెట్లు పెరిగింది. ఈ తరహా కంపెనీలు చైనా మార్కెట్లో ఎన్నో ఉండడం ఇన్వెస్టర్లలో భయాందోళనలను పెంచుతోంది.