: వీధుల్లో నడుస్తూ షాపింగ్ చేసిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వీధుల్లో ఒంటరిగా తిరిగారు. రెస్టారెంట్ కు వెళ్లి షాపింగ్ చేశారు. అక్కడున్న వారిని పలకరించారు. ఓ రోడ్డులో కూర్చున్న చిన్నారులను పలకరించారు. వారితో కాసేపు గడిపారు. నిత్యమూ అధికారులతో సమీక్షలు, దౌత్య కార్యక్రమాలు తదితరాలతో బిజీగా గడిపే ఒబామా ఈ విధంగా కాసేపు సేదదీరారు. ఆకాశం నిర్మలంగా ఉండి, 22 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత ఉండగా, వైట్ షర్ట్, బ్లాక్ టైతో బయటకు వచ్చిన ఆయన నడుస్తూ తిరిగారు. అనంతరం మాట్లాడుతూ, ఈ రోజు చాలా బాగుందని వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ వాయవ్య గేటు నుంచి నేషనల్ టీచర్ ఆఫ్ ది ఇయర్ షానా పీప్లెస్ తో కలసి ఆయన బయటకు వచ్చి నడక మొదలు పెట్టారు. వైట్ హౌస్ వీధిని దాటి హెచ్ స్ట్రీట్ కు వచ్చిన ఆయన ఆసియా టీ స్టాల్ 'టియాసియమ్' దగ్గర ఆగారు. అక్కడున్న వారికి "మిమ్మల్ని చూడడం చాలా ఆనందం కలిగించింది. కాస్తదూరం నడవాలనుకున్నాను. ఇవాళ చాలా బాగుంది" అంటూ ముందుకు కదిలారు. ఆ తరువాత షాపు లోపలికి వెళ్లి ఏడు నిమిషాల పాటు గడిపారు. ఓ షాపింగ్ బ్యాగ్ ను, టీ కప్ ను పట్టుకుని బయటకు వచ్చారు. అక్కడే ఉన్న చిన్నారులతో కాసేపు గడిపి, మరో 9 నిమిషాల తరువాత వైట్ హౌస్ గేట్ లోపలికి నడిచారు.