: బెజవాడ, విశాఖ, గుంటూరుల్లో జపనీస్ పాఠశాలలు... ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన
నవ్యాంధ్ర రాజధానిగా రూపుదిద్దుకుంటున్న గుంటూరు, కృష్ణా జిల్లాలు విదేశీ పాఠశాలలకు కేంద్రంగా మారనున్నాయి. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న విదేశీయుల కోసం వారి మాతృభాషలకు చెందిన మాధ్యమంలో పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పక్కా హామీ ఇచ్చారు. నిన్న విశాఖలో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు ఈ మేరకు విస్పష్ట ప్రకటన చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న జపనీయుల కోసం జపనీస్ భాషా పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. విజయవాడ, గుంటూరులతో పాటు పారిశ్రామిక కూడలిగా మారనున్న విశాఖపట్నంలోనూ ఈ తరహా పాఠశాలలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాక విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ, గుంటూరులోని నాగార్జున వర్సిటీల్లో జపనీస్ కోసం ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.