: సర్కారీ బడికే ఆ గ్రామ వాసుల ఓటు... పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపబోమని శపథం!
ఆదిలాబాదు జిల్లా వెనుకబడిన జిల్లా. అయితేనేం హైదరాబాదు లాంటి మహానగర వాసులకు కూడా ఆ జిల్లా వాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పిల్లలను ఇకపై ప్రైవేట్ స్కూలుకే పంపబోమని జిల్లాలోని పెండ్ పెల్లి వాసులు శపథం చేశారు. సర్కారు బడికే తమ ఓటంటూ నిన్న గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అంతేకాక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా కుటుంబానికి రూ.2,500ల చొప్పున చందాలు వేసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో 260 మంది పిల్లలు పాఠశాలకు వెళుతుండగా, గ్రామంలోని సర్కారీ బడికి కేవలం 60 మందే వెళుతున్నారు. మిగిలిన 200 మంది సమీపంలోని ప్రైవేట్ స్కూలుకు వెళుతున్నారు. తాజాగా గ్రామస్థుల తీర్మానంతో మొత్తం 260 మంది పిల్లలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించనున్నారు. నిన్న తీర్మానం అనంతరం పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి గ్రామస్థులు తమ ఆదర్శాన్ని చాటుకున్నారు.