: సిద్ధిపేటలో మావోల పోస్టర్లు... రైతుల భూములు లాక్కుంటే మూల్యం తప్పదని వార్నింగ్!
తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత మండలం సిద్ధిపేటలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం గోడలకు మావోల పోస్టర్లు వెలశాయి. మావోయిస్టు నేత జగన్ పేరిట వెలసిన ఈ పోస్టర్లలో ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. రైతుల నుంచి అతి తక్కువ ధరలకే భూములు లాక్కుంటున్న వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని ఆ పోస్టర్లలో మావోలు హెచ్చరించారు. అంతేకాక మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల నుంచి వెలికితీస్తున్న మట్టిని రైతుల పొలాలకు ఉచితంగానే తరలించాలని కూడా మావోలు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో మావోలు లేరంటూ పోలీసు అధికారులు ప్రకటిస్తున్నా, సీఎం సొంత మండలంలో మావోల పోస్టర్లు వెలుగుచూడటం గమనార్హం.