: ఇరు దేశాల చర్చల విషయంలో భారత్ ను నిందిస్తున్న పాక్
భారత్, పాకిస్థాన్ మధ్య గతేడాది విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు అర్ధాంతరంగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రెండు దేశాల మధ్య మళ్లీ చర్చలు జరిగే వాతావరణం ఏర్పడలేదు. ఆ తరువాత ఇరు దేశాల మంత్రులు, రాయబారులు ఒకరిపై మరొకరు ఈ విషయంలో స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా ఈ విషయంపై సౌదీ అరేబియా పత్రిక ఇంటర్వ్యూలో స్పందించినట్టు జియో టీవీ పేర్కొంది. 2014లో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కార్యదర్శి స్థాయి చర్చలను ఏకపక్షంగా భారతే నిలిపివేసిందని షరీఫ్ నిందించినట్టు పేర్కొంది. "పాకిస్థాన్ ముస్లీం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) తన పదవీకాలంలో దక్షిణ ఆసియా పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ఆసక్తి చూపుతోంది" అని అన్నట్టు జియో టీవీ వెల్లడించింది. అయితే చర్చలను మళ్లీ జరిపేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలకు భారత్ సానుకూలంగా స్పందించడంలేదని షరీఫ్ వ్యాఖ్యానించినట్టు వివరించింది.