: సామాజిక అనుసంధాన వేదికలను ద్వేషపూరిత ప్రచారాలకు దుర్వినియోగం చేస్తున్నారు: కేంద్రం
దేశంలో ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్స్ యాప్ వంటి పలు సామాజిక అనుసంధాన వేదికలను పలు సందర్భాల్లో ద్వేషపూరిత ప్రచారాలకు దుర్వినియోగపరుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. "ఇమెయిల్, బ్లాగ్స్, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్స్ యాప్ ల ద్వారా దేశంలో విద్వేషపూరిత ప్రచారం జరుగుతుందన్న విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికొస్తోంది" అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ రోజు పార్లమెంటుకు తెలిపారు. అలాగే దేశం బయటి నుంచి నిర్వహిస్తున్న నెట్వర్కింగ్ సైట్స్, ఇతర వెబ్ సైట్లలో హానికరమైన, ద్వేషాన్ని పెంచే కంటెంట్ ఉంటున్నట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. అయితే ఆ సైట్లను పర్యవేక్షించడంగానీ, నెట్వర్కింగ్ సైట్లలో కంటెంట్ ను నియంత్రించడంగానీ ప్రభుత్వం చేయడం లేదని మంత్రి వివరించారు.