: ఆత్మహత్య చేసుకునే రైతులు పిరికివాళ్లు, క్రిమినల్స్!: హర్యానా వ్యవసాయ మంత్రి
దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యలతో ఇప్పటికే కేంద్రం ఇరుకున పడింది. ఇటీవల ఢిల్లీలో గజేంద్రసింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. తాజాగా రైతుల ఆత్మహత్యలపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి ఓపీ ధనకర్ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు పిరికివాళ్లు, క్రిమినల్స్ అని వ్యాఖ్యానించారు. అలాంటివారికి ప్రభుత్వం సాయం చేయదని నిష్కర్షగా చెప్పారు. పిరికివాళ్లైతేనే ఆత్మహత్య చేసుకుంటారని, బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని మంత్రి ధనకర్ విమర్శించారు. దేశ చట్టాల ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం నేరమని, చట్టాన్ని అతిక్రమించి ప్రాణాలు తీసుకునేవారు నేరస్థులని అంటున్నారు. రాజకీయ వర్గాల్లో మంత్రి వ్యాఖ్యలు కొద్దిపాటి కలకలం రేపాయి.