: స్కర్టుతోనే రావాలి... బురఖాతో బడికి వచ్చిన బాలికకు ఫ్రాన్స్ పాఠశాల హుకుం!
పొట్టి దుస్తులతో బడికి వస్తే కఠిన దండన విధించే పాఠశాల యాజమాన్యాలను చూశాం. కురచ దుస్తులను నిషేధించిన పాఠశాలలూ మనకు చిరపరచితమే. కాని ఫ్రాన్స్ లోని ఓ పాఠశాల నిండుగా బట్టలేసుకుంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. స్కూలుకు రావాలంటే పొట్టి స్కర్టుల్లోనే రావాలని హుకుం జారీ చేసింది. దీంతో అసలే తండ్రిని బతిమాలి బడికి వస్తున్న ఓ ముస్లిం బాలిక ఏకంగా చదువుకే దూరమైపోయింది. ఫ్రాన్స్ లోని చార్లేవిల్లే మిజీర్స్ అనే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముస్లిం సంప్రదాయాలకు అత్యంత విలువిచ్చే తండ్రిని బతిమాలిన 15 ఏళ్ల బాలిక విద్య కొనసాగిస్తోంది. అయితే ప్రాయం వచ్చిన ఆ బాలిక ముస్లిం సంప్రదాయం ప్రకారం బురఖా ధరించాల్సి వచ్చింది. దీంతో బురఖా ధరించి వచ్చిన ఆ బాలికను పాఠశాల యాజమాన్యం కసురుకుంది. పొట్టి స్కర్టుతోనే స్కూలుకు రావాలని రెండు సార్లు తిప్పి పంపింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక తండ్రి ఆమెను స్కూలు మాన్పించేశాడు. దీంతో విద్య కొనసాగించాలన్న ఆ బాలిక ఆశలు అడియాశలే అయ్యాయి. అయితే బాలికను తాము పాఠశాల నుంచి బహిష్కరించలేదని, నిబంధనలకు అనుగుణమైన దుస్తులతోనే పాఠశాలకు రావాలని మాత్రమే ఆదేశించామని పట్టణ విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.