: అమెరికాలో అరుదైన ఘనత పొందిన మనమ్మాయి
న్యూయార్క్ నగరంలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస భారతీయురాలు, తన 16 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లి స్థిరపడ్డ రాజరాజేశ్వరి (43) న్యూయార్క్ క్రిమినల్ కోర్టు జడ్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమె నియామకాన్ని రెండు వారాల క్రితమే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ నగర మేయర్ బిల్ డే బ్లాసియో ఆమె చేత ప్రమాణం చేయించారు. గత 16 సంవత్సరాలుగా రాజరాజేశ్వరి వివిధ న్యాయ విభాగాల్లో పనిచేస్తూ, రిచ్ మండ్ కంట్రీ జిల్లా అటార్నీగా విధులు నిర్వహిస్తుండగా, ఈ పదవి వరించింది. అమెరికాలో న్యాయమూర్తిగా గౌరవం అందుకున్న తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి కావడం విశేషం. వేల మైళ్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన యువతికి ఇంతటి అరుదైన గౌరవం దక్కడం తనకెంతో గర్వంగా ఉందని ప్రమాణ స్వీకారం అనంతరం రాజరాజేశ్వరి వివరించారు.