: కేసీఆర్ కు దమ్ముంటే ఉస్మానియా వర్శిటీకి వెళ్లాలి: గంటా సవాల్
ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుపై విరుచుకుపడ్డారు. నిన్నటి సభలో కేసీఆర్, ఏపీ సర్కారు మీడియా సాయంతో మేనేజ్ చేస్తోందని, అక్కడేమీ సంక్షేమం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై గంటా స్పందిస్తూ... కేసీఆర్ సభలో మాట్లాడడం కాదని దమ్ముంటే ఉస్మానియా వర్శిటీకి వెళ్లి మాట్లాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనపై నెలకొన్న వ్యతిరేకత తెలుస్తుందని అన్నారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమితప్పదని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఉద్యమనేతగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో అభివృద్ధి జరగడంలేదని కేసీఆర్ అంటున్నారని, ఆయన ఏపీ కి వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో అర్థమవుతుందన్నారు. ఇక, చంద్రబాబుపై వ్యాఖ్యలను కూడా గంటా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సాటి ముఖ్యమంత్రిపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు.