: ధైర్యమంటే వీళ్లదే!
జపాన్ ఐజూ దీవుల్లో ఓ కుగ్రామం ఉంది. పేరు అగాషిమ. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఓ అగ్నిపర్వత బిలంలో ఉంది. ఎప్పుడు బద్దలవుతుందో తెలియని అగ్నిపర్వతం పక్కనే ఉన్నా ఆ గ్రామస్థులు భయపడరు. లోపల భగభగమండే లావా... ఎప్పుడైనా పెల్లుబుకవచ్చు! అగ్నిపర్వతం బద్దలైతే దాని ప్రభావం కొన్ని వందల మైళ్ల వరకు ఉంటుంది. లావా కొంతదూరమే ప్రవహించినా, ధూళి మాత్రం చాలాదూరం ఆవరిస్తుంది. అలాంటి పరిస్థితి ఏనాటికైనా తప్పదని తెలిసీ, అక్కడ నివసించడమంటే అదో సాహసమేనని చెప్పాలి. 1780 ప్రాంతంలో ఆ అగ్నిపర్వతం బద్దలు కాగా, గ్రామ జనాభాలో సగం మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు ఇతర దీవులకు వలసవెళ్లారు. ఆ తర్వాత మరో ఐదు దశాబ్దాలకు కొందరు గ్రామానికి తిరిగివచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారట. రవాణా వ్యవస్థ అంటే... ఓ హెలికాప్టర్ రోజుకు ఒక పర్యాయం టోక్యో నుంచి వచ్చి వెళుతుంది. 1993లో ఈ సర్వీసు ప్రారంభించారు. నౌకలు వచ్చేందుకు ఇక్కడ అనుకూలత లేదు. గ్రామ జనాభా 205 కాగా, గ్రామంలో ఉన్న పాఠశాలలో 25 మంది చదువుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం టోక్యోకు వెళ్లాల్సిందే. అలా వెళ్లిన వారు తిరిగి అగాషిమకు వచ్చేందుకు ఇష్టపడడంలేదు. అక్కడే స్థిరపడుతున్నారు. ఇక, గ్రామంలో వంట చేసుకోవాలంటే, అక్కడి వేడి నీటి చెలమలను వినియోగించుకుంటారు. ఎప్పుడూ సలసల మరిగిపోతున్నట్టుండే ఆ వేడినీటితో వంట కార్యక్రమాలు పూర్తవుతాయి. బాయిల్డ్ ఎగ్స్, బంగాళాదుంపలు వారి ప్రధాన ఆహారం.