: నేపాల్ లో ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు
తీవ్ర భూకంపం ధాటికి గూడు కోల్పోయి, సరైన తిండి లేక అలమటిస్తున్న నేపాలీలకు అక్కడి వ్యాపారులు మరింత షాక్ ఇచ్చారు. నిత్యావసరాల ధరలను అమాంతం పెంచేశారు. భూకంపం కారణంగా రోడ్లు, ఇతర వ్యవస్థలు దెబ్బతినడంతో సరకు రవాణాకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. దీంతో, ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ధరల పెరుగుదల నేపథ్యంలో, ప్రజలు చాలా చోట్ల అమ్మకాలకు ఆటంకం కలిగించారు. అటు, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద సహాయక చర్యలకు వర్షం, హిమపాతం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ, భారీ వర్షాలు, హిమపాతం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడున్న పర్వతారోహకులు క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ల సాయంతో వారిని మరింత సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారిలో పలు దేశాలకు చెందిన వారున్నారు.