: ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు భారీ జరిమానా!
రెడ్ సిగ్నల్ పడ్డా ఆగకుండా వెళ్లాడనో, మితిమీరిన వేగంతో ప్రయాణం చేస్తున్నాడనో, ట్రాఫిక్ రూల్స్ అధిగమించాడనో రోడ్లపై కాపుకాసే ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల ముక్కుపిండి మరీ జరిమానాలు వసూలు చేయడం మనకు తెలిసిందే. అయితే, ఇది అందుకు పూర్తిగా విరుద్ధం. గుర్ గావ్ లో ఓ కానిస్టేబుల్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నందుకు ఓ వ్యక్తికి జరిమానా విధించాడు. అదేమని ప్రశ్నిస్తే జరిమానాను రెట్టింపు చేశాడు. వివరాల్లోకి వెళితే, ఓ జంక్షన్ వద్ద గ్రీన్ లైట్ కోసం వేచి చూస్తున్న వ్యక్తి దగ్గరకు ట్రాఫిక్ పోలీసు వచ్చాడు. రెడ్ లైట్ దగ్గర అంత ఎక్కువ సేపు వేచి చూస్తున్నందుకు ఫైన్ చెల్లించమన్నాడు. తన వద్ద అన్ని కాగితాలూ ఉన్నాయని, సిగ్నల్ కోసమే ఎదురుచూస్తున్నానని చెబితే, ఫైన్ మొత్తాన్ని రెట్టింపు చేసి కట్టమన్నాడు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసు తన వెర్షన్ ను చెబుతూ, "ఇవాళా, రేపూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచిచూసేవారు ఎవరూ లేరు. ఏమాత్రం ఆదరాబాదరా లేకుండా సిగ్నల్ వద్ద వేచిచూస్తున్న ఈ వ్యక్తిని నేను రెండు నిమిషాలు పరిశీలించి చూశాను. ఆపై అనుమానం వచ్చింది. దగ్గరికెళ్లి జరిమానా కట్టమన్నాను. సిగ్నల్ పడ్డప్పుడు జంప్ చేయడం అత్యంత సాధారణమైన విషయం. అలా చేయకపోతే అనుమానాలు వస్తాయి. గత 20 సంవత్సరాలుగా ఇదే డ్యూటీ చేస్తున్న నాకు విదేశీయులు మాత్రమే రూల్స్ పాటించడం కనిపించింది. భారతీయులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కనిపించడం అమావాస్యకో, పున్నమికో కనిపిస్తుంది. అతని ఉద్దేశం ఏంటన్న అనుమానాలు వస్తాయి. అందుకే జరిమానా విధించా" అన్నాడు. ఈ మొత్తం ఉదంతాన్ని చూస్తూ, అక్కడే ఉన్న మరో వ్యక్తి సైతం ట్రాఫిక్ పోలీసు పనిని సమర్థించడం గమనార్హం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం భారతీయులకు అలవాటు. ఈ జరిమానాతో అయినా అతనికి బుద్ధి వచ్చివుంటుందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడింక ఏం చెయ్యాలంటారు?