: గంగానదిని ఎదురీది ముగ్గురు యువతులను కాపాడిన 14 ఏళ్ల సాహసి
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ఐదుగురు యువతులు కొట్టుకుపోతుండడం చూసి, తన ప్రాణాలను ఫణంగా పెట్టిన 14 ఏళ్ల బాలుడు, గొర్రెల కాపరి ముస్లింఖాన్ అత్యంత సాహసంతో ముగ్గురిని కాపాడాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాస్ గంజ్ జిల్లా, కాదర్ గంజ్ సమీపంలో జరిగింది. నదికి ఆవల ఉన్న పొలంలో పనికి వెళుతున్న ఐదుగురు అమ్మాయిలు నదిని దాటుతూ, ప్రమాదవశాత్తూ కాలుజారి కొట్టుకుపోవడం ఖాన్ కంటపడింది. వెంటనే నదిలో దూకిన ఖాన్ కొట్టుకుపోతున్న అమ్మాయిలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాడు. తనకు బాగా ఈత వచ్చినందునే నదిలో దూకానని, మిగతా ఇద్దరూ కళ్లముందే కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయానని ఖాన్ చెప్పాడు. ముస్లింఖాన్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ, అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలలకు ఇచ్చే అవార్డులకు అతని పేరును సిఫార్సు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు గల్లంతైన అఫ్రోజా, గుల్షన్ ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఇప్పుడా బాలుడు అక్కడ లోకల్ హీరోగా మారిపోయాడు.