: ఈ సాయంత్రం ఇజ్రాయెల్ వెళుతున్న మంత్రి పోచారం బృందం
ఇజ్రాయెల్ లో రేపటి నుంచి జరగనున్న అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శనకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బృందం ఈ సాయంత్రం వెళ్లనుంది. పోచారంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి ఇజ్రాయెల్ వెళుతున్నారు. ఈ పర్యటనపై కొన్ని రోజుల కిందట ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రాగా, వ్యవసాయ ప్రదర్శనకు అసలైన ఆదర్శ రైతులు వెళ్లాల్సింది పోయి రాజకీయ నేతలు వెళ్లడం సరికాదని ఆరోపణలు వచ్చాయి. ఆదర్శ రైతుల ముసుగులో ఇజ్రాయెల్ కు సొంత వ్యాపారాల కోసం వెళుతున్నారని టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి కూడా తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇజ్రాయెల్ బృంద సభ్యులు మాత్రం తమను తాము సమర్థించుకున్నారు. తాము రైతులం గనుకే పర్యటనకు వెళుతున్నామని అన్నారు.