: సమస్యల సుడిలో లిక్కర్ కింగ్... యూఎస్ఎల్ నిధుల మళ్లింపుపై సెబీ ఆరా!


నూతన సంవత్సరాది వస్తుందంటే, అందరి దృష్టి కింగ్ ఫిషర్ కేలండర్ పైనే ఉంటుంది. ఎందుకంటే, టాప్ మోడళ్ల అందచందాలతో కళకళలాడే ఆ కేలండర్లలో ఈసారి ఎవరికి చోటు దక్కింది, ఏ స్థాయిలో అందాలను ఆరబోశారన్న విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడవడం తెలిసిందే. ఇంతటి చర్చకు తెరలేపింది యునైటెడ్ బ్రూవరీస్ చీఫ్, లిక్కర్ కింగ్ గా ఖ్యాతిగాంచిన విజయ్ మాల్యానే. మాల్యా మోడళ్లలో స్థానం కోసం యత్నించిన మోడళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. విజయ్ మాల్యా డాబూదర్పానికి ఇదే నిదర్శనం. అయితే, మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది ప్రస్తుతం మాల్యా పరిస్థితి. ఇప్పటికే నష్టాలు రావడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను ఆయన అమ్మేసుకున్నారు. అప్పుల ఊబి నుంచి కోలుకునేందుకు తన లిక్కర్ సామ్రాజ్యంలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్)లో మెజారిటీ వాటాను డయోజియో అనే సంస్థకు విక్రయించారు. ప్రస్తుతం యూఎస్ఎల్ యాజమాన్య సంస్థ డయోజియోనే. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సమయంలో విజయ్ మాల్యా, యూఎస్ఎల్ నుంచి రూ.1,337 కోట్ల మేర నిధులను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తో పాటు ఇతర సంస్థల్లోకి మళ్లించారట. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆయనను డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకోవాలని డయోజియో కోరింది. అయితే అందుకు మాల్యా ససేమిరా అంటున్నారు. ఈ వివాదం ఇంకా సమసిపోకముందే, యూఎస్ఎల్ నిధుల మళ్లింపుపై తాజాగా సెబీ కూడా దృష్టి సారించింది. దీంతో మాల్యా తల పట్టుకున్నారట.

  • Loading...

More Telugu News