: లక్షల సంఖ్యలో రోడ్లపైకి తేనెటీగలు... బిక్కచచ్చిపోయిన హజారీబాగ్ వాసులు
చిన్న తేనెతుట్టె నుంచి వచ్చే స్వల్ప సంఖ్యలోని తేనెటీగలను చూస్తేనే పరుగులంకించుకుంటాం. దుప్పట్లు కప్పుకుని కాపాడుకుంటాం. అలాంటిది ఒకేసారి 24 పెద్ద తేనెతుట్టెల నుంచి లక్షల సంఖ్యలో తేనెటీగలు కదలి వస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది కూడా ఎలాంటి రక్షణ కవచం లభించని నట్టనడి రోడ్డు మీద. బిక్కచచ్చిపోవడం మినహా చేసేదేమీ ఉండదు. నిజమే, అలాంటి పరిస్థితే నిన్న జార్ఖండ్ లోని హజారీబాగ్ వాసులకు ఎదురైంది. హజారీబాగ్ లోని మూడంతస్తుల జీవన్ జ్యోతి క్యాంపస్ కు 24 పెద్ద పెద్ద తేనెతుట్టెలున్నాయి. నిన్నటి భూ ప్రకంపనలకు తేనెతుట్టెల్లోని తేనెటీగలన్నీ ఒక్కసారిగా లేచాయి. లక్షల సంఖ్యలో రోడ్డపైకొచ్చేశాయి. అంతే, ఒక్కసారిగా ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. కార్లలోని వారు చకచకా అద్దాలు బిగించుకున్నారు. బైక్ లపై ఉన్నవారు ఎటూ కదలడానికి లేదు. దీంతో ఏమైతే, అదే అవుతుందని అలాగే బిక్కచచ్చిపోయి, కళ్లు మూసుకుని కూర్చున్నారు. అయితే ఆ తేనెటీగలు ఏ ఒక్కరిపైనా దాడి చేయలేదు. వచ్చిన దారినే తిరిగి తమ తేనెతుట్టెల్లోకి చేరిపోయాయి. దీంతో బతుకుజీవుడా అంటూ నిలిచిపోయిన వారంతా కదిలిపోయారు.