: పరుగుపెట్టిన మధ్యప్రదేశ్ సీఎం... క్షణాల్లో ఐదో అంతస్తు నుంచి కిందకు వచ్చిన చౌహాన్
నేపాల్ ను నేలమట్టం చేసిన భూకంపం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పరుగు పెట్టించింది. ఐదో అంతస్తులో అధికారులతో భేటీలో నిమగ్నమైన ఆయన భూమి కంపించడంతో పరుగు పరుగున మెట్ల ద్వారా క్షణాల్లో కిందకు దిగేశారు. ప్రాణాలరచేతుల్లో పెట్టుకుని ఆయన అధికారులను అప్రమత్తం చేసి మరీ పరుగుపెట్టారు. ‘‘సచివాలయంలోని ఐదో అంతస్తులో అధికారులతో సమీక్ష జరుపుతున్నాను. 11.45 గంటలకు నా తల తిరిగినట్లనిపించింది. ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్లు కదులుతుండటం స్పష్టంగా కనిపించింది. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి మెట్ల మార్గం ద్వారా ఐదో అంతస్తు నుంచి వేగంగా కిందకు దిగిపోయా’’ అని ఆయన ఆ తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు వివరించారు.