: గవర్నర్ గా మోత్కుపల్లి... చంద్రబాబుకు సమాచారమిచ్చిన కేంద్రం?
టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి సమాచారం అందిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి ఆయనను గవర్నర్ గా పంపేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు నేపథ్యంలో అటు కేంద్రంతో పాటు ఇటు ఏపీలో పదవులను పంచుకోవాలన్న రెండు పార్టీల నిర్ణయం మేరకే మోత్కుపల్లికి గవర్నర్ గిరీ దక్కనుంది. గడచిన ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపని మోత్కుపల్లి, తనను రాజ్యసభ సభ్యుడిగా పంపాలని చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. అయితే ఎన్డీఏ అధికారంలోకి వస్తే, గవర్నర్ పదవి ఇప్పిస్తానన్న చంద్రబాబు హామీతో రాజ్యసభ సీటు డిమాండ్ ను మోత్కుపల్లి విరమించుకున్నారు. అనుకున్నట్లుగానే ఎన్డీఏ అధికారంలోకి రావడం అటు కేంద్రంలోనే కాక, ఇటు ఏపీలోనూ రెండు పార్టీల నేతలకు పదవుల పంపిణీ జరిగిపోయింది. ఈ క్రమంలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కనుంది. అయితే, ఏ రాష్ట్రానికి మోత్కుపల్లి గవర్నర్ గా వెళతారనే విషయం త్వరలోనే తేలనుంది.