: హీరోయిన్ నీతూ నా భార్య... ఆమెకు స్మగ్లింగ్ తో సంబంధాలు లేవు: మస్తాన్ వలీ
ఒక సినిమా నిర్మాణ సమయంలో హీరోయిన్ నీతూతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో తాను సినీనటి నీతూ అగర్వాల్ ను వివాహం చేసుకున్నానని, హైదరాబాదులో కాపురం చేస్తున్నామని ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసుల అదుపులో ఉన్న మస్తాన్ వలీ తెలిపాడు. ఆమెకు ఎర్రచందనం అక్రమ రవాణాతో ఎలాంటి సంబంధాలు లేవని వివరించాడు. గతంలో కమీషన్ల కోసం ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసిన మాట నిజమేనని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటన్నింటికి దూరంగా ఉంటున్నానని మస్తాన్ తెలిపాడు. ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు మస్తాన్ ను అనంతపురం జిల్లాకు తీసుకురాగా, ఆయన మీడియాకు ఈ విషయాలు వివరించాడు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కొందరు ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. కాగా, ఈ కేసులో నీతూను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.