: కేదార్ నాథ్ నడిచి ఎందుకు వెళ్లానంటే...!: రాహుల్ వివరణ
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ కు 16 కిలోమీటర్ల దూరం కొండల్లో నడుస్తూ వెళ్లడానికి గల కారణాన్ని రాహుల్ గాంధీ వివరించారు. "2013లో వచ్చిన వరదల్లో ఘోర మరణం పొందిన వారికి నివాళిగా నేను నడవాలని అనుకున్నాను" అని రాహుల్ వివరించారు. "నేను నడవడం చూసిన ప్రజలు, నేతలు కూడా ఇక్కడికి రావాలని, కేదార్ నాథ్ సందర్శించాలని అనుకుంటారు కదా?" అని రాహుల్ అన్నారు. బ్లూ టీషర్ట్, జీన్స్ ధరించిన రాహుల్ ప్రభుత్వాధికారులు హెలికాప్టర్లో వెళ్లాలని సూచించినా, అంగీకరించని సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఉత్తరాఖండ్ ను ముంచెత్తిన వరదల్లో సుమారు 6 వేల మందికి పైగా మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే.