: అందుకే వారికి ఈ సినిమా అర్థం కాలేదు!: అల్లు అర్జున్
'అత్తారింటికి దారేది' సినిమా పూర్తయిన తరువాత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సినిమా చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు రెండు విషయాల గురించే ఆలోచించామని హీరో అల్లు అర్జున్ తెలిపాడు. విశాఖపట్టణంలో జరిగిన 'సన్నాఫ్ సత్యమూర్తి' విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈజీ సినిమా చేద్దామా? లేక కష్టమైన సినిమా చేద్దామా? అని ఆలోచించామని చెప్పాడు. దీంతో కష్టమైనా సరే మంచి సినిమా చేద్దామని నిర్ణయించుకున్నామని అల్లు అర్జున్ తెలిపాడు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన సినిమా చేయాలని తపనపడే దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరని చెప్పిన అల్లు అర్జున్, 'అత్తారింటికి దారేది' సినిమా విజయంతో గబగబా మూడునెలల్లో ఓ సినిమా పూర్తి చేసేసి చేతినిండా డబ్బులు సంపాదించొచ్చు. అలాంటి అవకాశాన్ని వదులుకుని, ఏడాది పాటు కష్టపడి ఈ సినిమా చేశారని తెలిపాడు. త్రివిక్రమ్ సూచించినట్టే, సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కష్టాలు ఎదుర్కొందని చెప్పాడు. ఓ వర్గం సినిమా బాలేదని చెబితే, దానికి బలం చేకూరుస్తూ, రివ్యూలు నెగిటివ్ గా రాశారని చెప్పాడు. వీటన్నింటినీ లెక్క చేయకుండా, అభిమానులు ఆదరించారని అల్లు అర్జున్ తెలిపాడు. తాము ఏం చేసినా అభిమానులు ఆదరిస్తారని ధైర్యమిచ్చినందుకు అభినందనలని ఆయన చెప్పాడు. ఇంత డివైడ్ టాక్ తో మంచి కలెక్షన్లు సాధిస్తుందని భావించలేదని సినిమాటిక్ గా చెప్పి అభిమానులను అలరించాడు. తనతోపాటు సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని అల్లు అర్జున్ చెప్పాడు. తొలి రోజు సినిమా చూసేవాళ్లు ఇంటెలిజెన్స్ తో థియేటర్ కు వస్తారని, అందుకే వారికి ఈ సినిమా అర్థం కాలేదని, మనసుతో చూడాల్సిన సినిమా కనుక అభిమానులను అలరించిందని అల్లు అర్జున్ స్పష్టం చేశాడు.