: అన్ రిజర్వుడు రైల్వే టిక్కెట్ల కోసం మొబైల్ యాప్ 'అట్సన్ మొబైల్'
రైల్వేల్లో అన్ రిజర్వుడు టిక్కెట్లను రిజర్వ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ, 'అట్సన్ మొబైల్' పేరిట సరికొత్త యాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసింది. తొలుత దీన్ని సదరన్ రైల్వే పరిధిలోని చెన్నై ఎగ్మోర్, తాంబరం సబర్బన్ సెక్షన్లలోని స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చినట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు వివరించారు. సాధ్యమైనంత మేరకు కాగితం వాడకుండా చూసేందుకే దీన్ని డెవలప్ చేసినట్టు వివరించారు. ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారు మొబైల్ కు వచ్చిన మెసేజ్ చూపితే సరిపోతుందని, దాన్ని ప్రింటౌట్ తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ యాప్ లోని 'రైల్వే వాలెట్' మాధ్యమంగా నగదు చెల్లింపులు జరపాల్సి వుంటుందని తెలిపారు. రైల్వే టిక్కెట్లను ప్రింట్ చేసేందుకు ప్రతియేటా 1200 మెట్రిక్ టన్నుల పేపర్ ఖర్చవుతోందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. చెన్నై సబర్బన్ రైళ్లలో ప్రయాణించేవారు టిక్కెట్ ను బుక్ చేసుకున్న గంటలోగా దాన్ని వాడుకోవాల్సి వుంటుందని, దీన్ని మరో మొబైల్ కు ట్రాన్స్ ఫర్ చేయలేరని అధికారులు వివరించారు.