: టార్గెట్ చంద్రబాబు... దుబాయ్ కేంద్రంగా పావులు కదుపుతున్న హమీద్


వారు ఇప్పటిదాకా నిరాటంకంగా ఎర్రచందనం దుంగలను విదేశాలకు స్మగ్లింగ్ చేసి కోట్లకు పడగలెత్తినవాళ్లు! ఒక్కసారిగా ఏపీ సర్కారు కఠిన చర్యలకు దిగడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కాల్చి చంపేందుకు కూడా ఏపీ పోలీసు విభాగం సిద్ధపడడంతో వారిలో తీవ్రమైన అసహనం నెలకొంది. దీనికంతటికీ కారణం సీఎం చంద్రబాబేనని బలంగా నమ్ముతున్నారు. ఆయనను అడ్డుతొలగించుకుంటే, 20 మంది ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీరడంతో పాటు, యథావిధిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకోవచ్చన్నది ఈ స్మగ్లర్ల యోచన. చంద్రబాబు హత్యకు దుబాయ్ నుంచే వ్యూహరచన జరిగిందని తెలుస్తోంది. బడా స్మగ్లర్ హమీద్ దుబాయ్ లో ఉంటూ బాబును అంతమొందించేందుకు పావులు కదుపుతున్నాడని నిఘా వర్గాలంటున్నాయి. హమీద్ అనుచరులు ఒక్కొక్కరుగా అరెస్టవుతుండడంతో, వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందేమోనన్న భయంతో చంద్రబాబును టార్గెట్ చేశారని అర్థమవుతోంది. హమీద్ కు మారిషస్ జైల్లో మరో బడా స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డితో సత్సంబంధాలున్నాయన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కాగా, మిజోరాం స్మగ్లర్ శామ్యూల్, ఢిల్లీ స్మగ్లర్ విక్రమ్, తమిళనాడు స్మగ్లర్లు లక్ష్మణన్, శరవణన్, మూసా, నాగరాజన్, సౌందరరాజన్ లు హమీద్ అనుచరులని నిఘా వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News