: చంద్రబాబు హత్యకు 'ఎర్ర' స్మగ్లర్ల ప్లాన్... నిఘా వర్గాలకు పక్కా సమాచారం
కోట్లు కురిపించే ఎర్రచందనం అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపిన ఏపీ సీఎం చంద్రబాబును అడ్డుతొలగించుకునేందుకు స్మగ్లర్లు కుట్ర పన్నినట్టు తెలిసింది. శేషాచలం ఎన్ కౌంటర్ తో తీవ్రమైన ఎదురుదెబ్బ తిన్న స్మగర్లు ప్రతీకారం కోసం కాచుకుని ఉన్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వారు చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న సమాచారం నిఘా సంస్థలనే నివ్వెరపరిచింది. చంద్రబాబు అనంతపురం టూర్ సందర్భంగా రెక్కీ కూడా నిర్వహించారని తెలిసింది. ఈ నేపథ్యంలో, చంద్రబాబు భద్రతను కట్టుదిట్టం చేశారు. చంద్రబాబు జిల్లాల్లో పర్యటించేటప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు వెళ్లాయి. కొన్నిరోజుల క్రితం శేషాచలం అడవుల్లో 20 మందిని ఎన్ కౌంటర్ చేసిన ఏపీ పోలీసులు, తాజాగా చెన్నైలో దాడులు నిర్వహించి శరవణన్ అనే స్మగ్లర్ ను అరెస్టు చేశారు. భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటు, ఇతర రాష్ట్రాల్లోనూ తమిళనాడు స్మగ్లర్లకు చెందిన ఎర్రచందనం భారీగా పట్టుబడింది.