: భారత్ లో ఓ మైదానం కేటాయించండి... 'సొంతగడ్డ'గా భావిస్తాం: బీసీసీఐకి ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు విన్నపం
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) బీసీసీఐకి అసాధారణ రీతిలో విన్నపం చేసుకుంది. భారత్ లో ఓ మైదానం కేటాయిస్తే, 'సొంతగడ్డ' మ్యాచ్ లను నిర్వహించుకుంటామని తెలిపింది. ఆఫ్ఘన్ లో పరిస్థితులు సరిగా లేనందున అక్కడ మ్యాచ్ లు జరపడం కష్టమని ఏసీబీ పేర్కొంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం అయితే తమకు సరిపోతుందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని వచ్చే వారం భారత్ వస్తున్నారు. ఈ సందర్భంగా, ఆయన బీసీసీఐతో ఈ విషయమై లోతుగా చర్చించే అవకాశాలున్నాయి. దీనిపై, బీసీసీఐ క్రికెట్ డెవలప్ మెంట్ మేనేజర్ రత్నాకర్ శెట్టి మాట్లాడుతూ... మీడియాతో ఇప్పుడే ఈ విషయమై ఏమీ చెప్పలేమన్నారు. దేశంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో, ఆఫ్ఘన్ జట్టు తన హోమ్ గ్రౌండ్ మ్యాచ్ లను షార్జా వేదికగా నిర్వహించుకుంటోంది. ఇటీవలే వరల్డ్ కప్ కు అర్హత సాధించి, అక్కడ తనదైన ముద్ర వేసిన ఈ ఆసియా పసికూన, అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదిగేందుకు తహతహలాడుతోంది.