: నెట్ న్యూట్రాలిటీపై లోక్ సభలో చర్చ... చట్టం తీసుకురావాలన్న రాహుల్ గాంధీ
దేశంలో కొన్ని రోజులుగా ఓ అంశంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. అదే నెట్ న్యూట్రాలిటీ... అంటే అంతర్జాల సమానత్వం. ఇంటర్నెట్ పై కొన్ని టెలికాం కంపెనీలు అవసరాలను బట్టి పరిమితులతో తీసుకొస్తున్న పథకాల వల్ల అందరికీ సమానంగా ఇంటర్నెట్ అందడంలేదు. ఈ తీరు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానిపై ఈరోజు లోక్ సభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, నెట్ న్యూట్రాలిటీ చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వం తలొగ్గుతోందని విమర్శించారు. దాంతో రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, నెట్ న్యూట్రాలిటీపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఏ కార్పోరేట్ వర్గాలకు ప్రభుత్వం తలవంచడం లేదన్నారు. ఈ అంశంపై త్వరలోనే నిబంధనలు రూపొందిస్తామని చెప్పారు. అదే సమయంలో మాట్లాడిన మంత్రి వెంకయ్యనాయుడు, రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. దాంతో సభలో ఇరుపక్షాల సభ్యులు గందరగోళం సృష్టించారు.