: డిప్యూటీ స్పీకర్ కు స్పీకర్ మహాజన్ మందలింపు!
తమిళనాడుకు చెందిన లోక్ సభ సభ్యుడు, అన్నాడీఎంకే నేత తంబిదురైకి లోక్ సభలో నిన్న చేదు అనుభవం ఎదురైంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయనను మందలించారు. అదేంటీ, సభలో సభ్యుల నిరసనలు, స్పీకర్ అసహనం మామూలే కదా అనుకుంటున్నారా? మీ వాదన కరెక్టే కానీ, తంబిదురై ఎంపీగానే కాక లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గానూ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, శేషాచలం ఎన్ కౌంటర్ పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాక, సభా కార్యక్రమాలకు అడ్డు తగిలేలా ప్రవర్తించారు మరి. నిన్నటి సమావేశాల్లో భాగంగా శేషాచలం ఎన్ కౌంటర్ అంశంపై మాట్లాడిన తంబిదురై, ఈ ఘటనలో ఏపీ పోలీసులు తమిళ కూలీలను అమానుషంగా చంపేశారని ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తున్నారా? లేదా? అంటూ ఆయన హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను నిలదీశారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న స్పీకర్ ‘‘తంబిదురై గారు, మీరు డిప్యూటీ స్పీకర్ అన్న విషయం మరుస్తున్నారు. మీకేదైనా కావాలంటే నన్ను అడగండి. మంత్రులనెందుకు అడుగుతారు?’’ అని ఆయనపై ఆసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ జోక్యంతో తాను డిప్యూటీ స్పీకర్ ను అన్న విషయం గుర్తుకు తెచ్చుకుని తంబిదురై మిన్నకుండిపోయారట.