: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీని తొలగించిన ఢిల్లీ వైద్యులు
సాధారణంగా కిడ్నీ ఎంత బరువుంటుంది? 130 గ్రాములకు అటూ ఇటూగా ఉంటుంది. కానీ, ఓ వ్యక్తి కిడ్నీ మాత్రం అసాధారణ రీతిలో 2.75 కేజీల బరువుతో రికార్డు సృష్టించింది. తీవ్రమైన కడుపునొప్పి, మూత్రంలో రక్తం, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఢిల్లీలోని శ్రీ గంగారం ఆసుపత్రిలో చేరాడు. అతడు ఆటోసోమల్ డామినెంట్ పాలీసిస్టిక్ కిడ్నీ (ఏడీపీకేడీ) అనే వ్యాధితో బాధపడుతున్నట్టు అక్కడి వైద్యులు గుర్తించారు. కిడ్నీ తొలగించకపోతే ప్రాణాపాయం తప్పదన్న స్థితిలో ఆ వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ కిడ్నీ 2.75 కిలోల బరువుతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే అతనికి కిడ్నీలు అమర్చే అవకాశాలున్నాయి. ఈ వ్యక్తికి ఇంతకుముందే 2.5 కేజీల బరువున్న ఓ కిడ్నీని తొలగించారు. తాజా ఆపరేషన్ తో రెండో కిడ్నీని కూడా తొలగించారు.