: గూగుల్ నుంచి 'మొబైల్ గెడాన్'... స్మార్ట్ ఫోన్ల కోసమే!
మొబైల్ మాధ్యమంగా వివిధ విషయాలను సెర్చ్ చేస్తున్న యూజర్ల సంఖ్య పెరగడంతో, ఈ విభాగం నుంచి అధిక ఆదాయాన్ని ఆశిస్తున్న గూగుల్, 'మొబైల్ గెడాన్' పేరిట కొత్త సేవలను నేడు ప్రారంభించింది. దీనితో మరింత సులభంగా స్మార్ట్ ఫోన్ల నుంచి సెర్చ్ చేసుకోవచ్చని వివరించింది. మొబైల్ ఫ్రెండ్లీగా ఉండే వెబ్ సైట్ల గురించిన సమాచారం తొలుత లభించేలా 'మొబైల్ గెడాన్'ను రూపొందించినట్టు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా మినీ సైట్లను ఏర్పాటు చేయని కంపెనీల ర్యాంకులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెర్చింజన్ సేవలందుతున్న అన్ని భాషల్లో ఈ మార్పులు ఉంటాయని గూగుల్ వెల్లడించింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఏఐ) అంచనాల ప్రకారం ఇండియాలో సెర్చ్ ట్రాఫిక్ 50 శాతానికి పైగా మొబైల్ ఫోన్ల మాధ్యమంగానే నడుస్తోంది. డిసెంబర్ 2014 నాటికి మొత్తం 17.3 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు భారత్ లో ఉండగా, వీరిలో 74 శాతం మంది ఇ-మెయిల్, సామాజిక మాధ్యమాల వెబ్ సైట్లను చూసేందుకు డేటాను వాడుతున్నారు. ఇండియాలో చాలా ప్రముఖ వెబ్ సైట్లు మొబైల్ ఫ్రెండ్లీగా లేవు. గూగుల్ తీసుకున్న ఈ అడుగుతో అవన్నీ స్మార్ట్ ఫోన్ల కోసం మొబైల్ వర్షన్ ను తయారు చేసుకోవాల్సిందేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ-కామర్స్ సైట్లన్నీ మొబైల్ వర్షన్ ను అందిస్తున్నాయి. చిన్న మధ్య తరహా సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు మాత్రం ఈ విషయంలో అంతగా ఆసక్తిని చూపలేదు.