: ఓవైసీ గారూ... మీకు బెంగళూరులోకి ప్రవేశం లేదు: కర్ణాటక పోలీసుల ఆంక్షలు
ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చకు తెర తీస్తున్న మజ్లిస్ సోదరులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలపై నిషేధాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో వీరి ప్రవేశంపై నిషేధం అమలవుతుండగా, తాజాగా ఆ జాబితాలో బెంగళూరు కూడా చేరిపోయింది. ఈ నెల 24 నుంచి 28 దాకా అసదుద్దీన్ ఓవైసీ బెంగళూరులో పర్యటించాల్సి ఉంది. అయితే నిన్న బెంగళూరు పోలీసుల నుంచి అసదుద్దీన్ కు ఓ నోటీసు అందింది. ‘‘బెంగళూరులో మీరు ప్రవేశించడానికి వీలు లేదు. అంతేకాక ఆడియో, విజువల్ మీడియా ద్వారా కూడా మీరు ప్రసంగించేందుకు కుదరదు’’ అంటూ బెంగళూరు పోలీసులు ఆ నోటీసుల్లో అసదుద్దీన్ కు తేల్చిచెప్పారు.