: డబ్బులు లేకపోతే కాళ్లు మొక్కండి... దంపతులపై ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ దాష్టీకం!
హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు మితిమీరుతున్నారు. వాహనదారులపై విరుచుకుపడుతున్న పోలీసులు, అనవసర జోక్యాలతో కావాలని మరీ రెచ్చిపోతున్నారు. ఈ తరహా ఘటన నేటి ఉదయం అమీర్ పేట పరిధిలోని బల్కంపేటలో చోటుచేసుకుంది. బైక్ పై వెళుతున్న ఓ జంట, ముందుగా వెళుతున్న ఇన్నోవా కారును స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో కారు నేమ్ ప్లేట్ కాస్త వంగిపోయింది. దీంతో సదరు కారు యజమానితో మాట్లాడిన బైక్ యజమాని, నష్టాన్ని తాను భరిస్తానని చెప్పడమే కాక తన మొబైల్ నెంబరునూ ఇచ్చాడు. ఈ విషయాలన్నీ దూరంగా ఉండి గమనిస్తున్న సనత్ నగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్, అక్కడికొచ్చి వివాదంలో తలదూర్చారు. అసలేమైందని ప్రశ్నిస్తూనే, కారు యజమానికి డబ్బిచ్చావా? అంటూ బైక్ యజమానిని అడిగారు. డబ్బు అవసరం లేకుండానే వివాదం పరిష్కారమైందన్న బైకర్ తో వాగ్వాదానికి దిగిన ఇన్ స్పెక్టర్, వెళ్లిపోతున్న కారు యజమానిని పిలిచి మరీ ఉసిగొల్పాడు. అయితే కారు యజమాని సంయమనం పాటించారు. అయినా వినిపించుకోని ఇన్ స్పెక్టర్, అక్కడికక్కడే కారు యజమానికి డబ్బివ్వాల్సిందేనని బైకర్ ను గద్దించాడు. డబ్బు లేకపోతే కారు యజమాని కాళ్లు పట్టుకోండంటూ బైక్ యజమాని భార్యకు హుకుం జారీ చేశాడు. ఇదేం పద్ధతంటూ వారు నిలదీయడంతో, అదంతేనంటూ దాష్టీకాన్ని కొనసాగించబోయి, మీడియా రంగప్రవేశంతో చిన్నగా తప్పుకున్నాడు. ఇన్ స్పెక్టర్ అవమానకరంగా మాట్లాడటంతో ఆవేదనకు గురైన దంపతులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో సదరు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పై ఫిర్యాదు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న సదరు ఇన్ స్పెక్టర్, ఫిర్యాదు వెనక్కుతీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బాధితులను ఫోన్ లో బెదిరించాడట!